
(తెలంగాణ సామ్నా, డెస్క్)
సువేందు అధికారి నేతృత్వంలో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. గత 15 ఏళ్లుగా అధికారంలో కొనసాగిన మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పాలనకు తెరపడుతూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తొలిసారిగా అధికారాన్ని చేపట్టింది.
శనివారం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఈ పరిణామం కీలక మలుపుగా భావిస్తున్నారు. 293 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. నందిగ్రామ్, భవానీపూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన సువేందు అధికారి రెండింటిలోనూ విజయం సాధించారు. ముఖ్యంగా భవానీపూర్‌లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై గెలుపొందడం రాజకీయ వర్గాల్లో విశేష చర్చకు దారితీసింది.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోదీ, అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరై సువేందు అధికారికి శుభాకాంక్షలు తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం దేశ రాజకీయాల్లో కీలక పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసిన ఈ ఫలితాలు జాతీయ రాజకీయాల్లోనూ ప్రభావం చూపనున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

