(బాలే అజయ్ – 9290277727)
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆదివారం వాసవి మాత జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా సాగాయి.
అర్చకులు పాలెపు రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో వాసవి మాత మూలవిరాట్ మరియు ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమార్చనలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి మాట్లాడుతూ, విశ్వంలోని సమస్త జీవుల శ్రేయస్సు కోరేదే సనాతన ధర్మమని పేర్కొన్నారు. “మా వర్గం మాత్రమే బాగుండాలి, అనే తత్వం కాకుండా, సమస్త మానవాళి సుఖసంతోషాలతో ఉండాలని”, ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనే సర్వ మానవ శ్రేయస్సును కోరేది కేవలం సనాతన హిందూ ధర్మమేనని పేర్కొన్నారు.
అలాగే ప్రాచీన కాలం నుండి దేవాలయాలు, ధార్మిక కార్యక్రమాల్లో ఆర్యవైశ్య సమాజం చేసిన సేవలు, వారి త్యాగనిరతి, దానగుణం ప్రశంసనీయమని అభివర్ణించారు. వాసవి మాత ఆశీస్సులతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకల్లో స్థానిక ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ప్రసాద విరివిగా పంపిణీ చేశారు.
