
తెలంగాణ సామ్నా డెస్క్: భవిష్యత్తు అంతా అందకారంగా కనిపించింది ఆ తల్లికి. నెలలు నిండని కొడుకుతో చేతిలో కొద్దొ గొప్పో బీడీలు చుట్టే పనితో ఆ తల్లి పాత ఇల్లు మారి కొత్త కిరాయి ఇంటికి మారింది. ఇంటి యజమాని సాధు స్వభావి కావడం ఆ ఇంట్లో భార్యభర్తలు ఇద్దరే వుండడంతో ఆమెకు మిగిలిన అన్నం కూరలు వేసి ఇవ్వడం జరిగేది. కొద్ది నెలల్లోనే అలా ఆమె వారికి ఓ కూతురులాగా మారి వారికి చేదోడు వాదోడుగా వుండేది. మరికొంత కాలం గడిచిపోయింది. కొడుకు బుడిబుడి అడుగలు వేస్తున్నాడు. కొడుకును ఎలా పెంచుతావని ఓ సారి ఇంటి యజమాని అడిగితే మౌనం, కన్నీళ్లే సమాధానం అయి బాధను తట్టుకోలేక ‘‘తండ్రి కాని తండ్రి’’ ఆ ఇంటి యజమాని కాళ్లపై పడి కన్నీళ్ల పర్యంతం అయ్యింది.ఆ పెద్దమనిషే పెద్ద మనసు చేసుకొని తనకు తెలిసిన ఓ హస్పిటల్‌లో పనికి పెట్టించాడు. పనికి వెళ్లేటప్పుడు ఆ ‘‘తల్లి కాని తల్లి’’ వద్దే కొడుకును వుంచేది. తిరిగి సాయంత్రం పని నుండి వచ్చేది. అంతవరకు ఆమె కొడుకును ఆ తల్లే చూసుకునేది.
లా ఓ పది సంవత్సరాలు గడిచాయి. ఆమె కొడుకు ఆ ఇంటి మనుమడుగా పెరగసాగాడు. ఆ తాత నానమ్మలకు చేదోడు వాదోడుగా వుండేవాడు. రాఖీ పండగ వస్తే కూడా ఆమెతో ఆ యజమాని కొడుకులు రాఖీ కట్టించుకునేవారు. అంతగా కలిసిపోయారు వారు. ఆమె కొడుకు కూడా చదువుకుంటు పదవ తరగతిలో జిల్లాలోనే రెండవస్థానంలో వచ్చాడు. ఆ రోజు ఆమె కళ్లనుండి రాలిన కన్నీళ్లకు ఆర్థం చెప్పడం ఎంత గొప్ప కవికైనా వర్థించడం సాధ్యం కాకపోవచ్చు. అబ్బాయి చదువులో చురుకుగా వున్నాడని ప్రైవేట్ కాలేజీ వారు వచ్చి ఉచితంగా చదువు చెబుతామని హస్టల్ ఫీజు కట్టుకుంటే చాలని ఆమెకు చెప్పారు. తన దగ్గర దాచుకొన్న కొంత డబ్బుతో పాటు యజమాని సంతోషంతో ఇచ్చిన డబ్బును కలిపి జాయిన్ చేసింది. ఎలాగోలా మరో రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. అబ్బాయి అద్బుతంగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యాడు.
ఆ యాజమాని ఇంటికి వచ్చిన నాటినుండి ఆమెకు ఎదో ఒక రకంగా మంచే జరుగుతుంది అనే భావన ఆమెలో ఎర్పడిరది. దానికి తోడుగా ఇంట్లో భార్యభర్తలు ఇద్దరే వుండడం. వారి కొడుకులు ఇద్దరు వేరే చోట్లో వుండడం, ఆమె కూడా ఇంట్లో కలిసిపోవడం, ఆ యజమాని కుటుంబం ఆమెను కూతురుగా, సోదరి సమానురాలుగా చూసుకోవడం, అన్నిటికి మేమున్నాము అనే ధీమాను కల్పించడంతో ఎంత కష్టం అనిపించిన దిగమింగుకొని ఇక తన బ్రతుకంతా కొడుకే అనే లక్ష్యంతో ఆమె బ్రతుకుతున్నది. అందుకు తగినట్టుగానే కొడుకు బుద్ధిగా చదువుకుంటు పదిమందిలో శభాష్ అనిపించుకుంటున్నాడు.
కొడుకు ఇంటర్ పూర్తయ్యాకా టిటిసి ప్రవేశ పరీక్ష రాసాడు. అనుకున్నట్లుగానే అందులో సీటు వచ్చింది. తల్లికి, ఇంటి యజమానుల సంతోషానికి హద్దులు లేవన్నట్లుగా ఆనందపడ్డారు. భర్తతో ఆనందం లేకపోయినా కొడుకు ప్రయోజకుడవుతున్నాడని అందరు సంబరపడ్డారు. మరో రెండు సంవత్సరాలు గడిచాయి. ఆ అబ్బాయి టిటిసి పూర్తవ్వడం అదే సంవత్సరం డిఎస్‌సి నిర్వహించడం, మొదటి ప్రయత్నంలోనే టీచర్ ఉద్యోగం సంపాదదించడం చూస్తుండగానే జరిగిపోయాయి. అంత వరకు కష్టం, పని తప్ప మరే విషయం తెలియని ఆమె ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.
ఆ ఆనందాన్ని యజమాని కాళ్ల మీద పడి ఏడ్చి ఏడ్చి పంచుకుంది ఆమె. ఆమెకు ఆర్థం అయ్యింది. వారే గనక నన్ను ఆదరించకపోయి వుంటే తాను ఏలా వుండే దానినో ఏలా బ్రతికేదానినో అని.కొడుకు ఉద్యోగంలో చేరాడు. తాము వుంటున్న ఊరికి దాదాపు 40 కిలోమీటర్ల దూరం. కొద్ది రోజులు కొడుకు వెళ్లి పచ్చినా ప్రతిరోజు సాధ్యం కాదని అక్కడే వుందామని ఆమ్మతో విచారం చేశాడు కొడుకు. ఆ తల్లి తనకు పునర్జన్మనిచ్చిన తల్లిదండ్రులను విడిచి రానని చెప్పింది. కాని ఆ తల్లిదండ్రులే కొడుకుతో పాటుగా వుండక తప్పదు అని చెప్పడంతో బలవంతంగా కొడుకుకు వండి ఇంటిపనులు చూసుకోవడానికి అని కొడుకు ఉద్యోగం చేసే ఊరికి ప్రయాణం అయ్యింది.
(మిగితా రేపు)

