(తెలంగాణ సామ్నా డెస్క్)
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖల సమన్వయంతో సోమవారం కోరుట్ల మండలం మోహనరావు పేట్ గ్రామంలో నిర్వహించారు. ఈ గ్రామసభల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలతో నేరుగా మమేకమై ప్రజల భద్రత, యువత భవిష్యత్తు, రోడ్డు ప్రమాదాల నివారణ , సైబర్ నేరాలు,మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా ప్రచారం గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించడం ప్రమాదాలకు కారణమవుతాయని హెచ్చరించారు. అదేవిధంగా యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం సమాజం మొత్తం బాధ్యత అని పేర్కొంటూ గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. గ్రామాల్లో ఎక్కడైనా గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, ఏటీఎం పిన్ నంబర్లు, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని , ఫేక్ కాల్స్, సందేశాలు, సోషల్ మీడియా లింకులు, ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రత, బాల్య వివాహాల నిర్మూలన, మహిళలపై వేధింపుల నివారణ, ప్రజా ఆస్తుల పరిరక్షణ, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల పాత్ర వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు పొలాల్లో వరి కొయ్యలు కాల్చకూడదని తీర్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి, కోరుట్ల ఇన్చార్జి CI B.సురేష్ బాబు, కోరుట్ల మండల తాహసిల్దార్ కృష్ణ చైతన్య ,మండల పంచాయతీ రాజ్ ఆఫీసర్ రాజశేఖర్, ఎస్ఐలు చిరంజీవి, రామచంద్రం, శ్రీధర్ రెడ్డి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నాగమణి ,మోహన్ రావు పేట గ్రామ సర్పంచ్ సరికెళ్ళ లతిక , ఉప సర్పంచ్ వెంకటేష్ , గ్రామస్థులు పాల్గొన్నారు.

