
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, మెట్పల్లి డీఎస్పీ ఎ. రాములు పర్యవేక్షణలో, కోరుట్ల సీఐ కె. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గంజాయి మరియు మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కోరుట్ల ఎస్సై ఎం. చిరంజీవి మాట్లాడుతూ యువత కొత్త వ్యక్తుల పరిచయాలు, ఆసక్తి మరియు మొదటిసారి అనుభవం కోసం మత్తు పదార్థాల వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల మెదడు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, రక్తం మరియు నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని, తద్వారా ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటాయని వివరించారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి క్రీడలు, విద్య మరియు లక్ష్య సాధనపై దృష్టి సారించాలని సూచించారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రెహమాన్, సాహితీ మేడం, అధ్యాపకులు మరియు సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
