(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని 7వ వార్డు కౌన్సిలర్ గూగులోవాత్ శ్రీకాంత్ , గుద్దెరి రాజేందర్ డిమాండ్
గణపతి, దేవి విగ్రహాల తయారీకి కోరుట్ల పట్టణం ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా విగ్రహాల కొనుగోలు కోసం వ్యాపారులు, భక్తులు కోరుట్లకు తరలివస్తుంటారు. విగ్రహాల తయారీ కేంద్రంగా పట్టణం అభివృద్ధి చెందడంతో వందలాది కుటుంబాలకు ఈ వృత్తి జీవనోపాధిగా మారింది.
అయితే విగ్రహ తయారీదారులు, కొనుగోలుదారులు, వాహనదారులకు అవసరమైన మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద ప్రధాన రహదారిపై తగినంత వెలుతురు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోందని పేర్కొంటున్నారు.
రాత్రి వేళల్లో రహదారిపై హైమాస్ట్ లైట్లు లేకపోవడంతో ఎదుటి నుంచి వచ్చే వాహనాల హెడ్‌లైట్ల వెలుతురు కారణంగా రహదారిపై నడిచే పాదచారులు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పలు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం కూడా సంభవించిందని, అయినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కోరుట్ల మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ గూగులోత్ శ్రీకాంత్, గుద్దేటి రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. విగ్రహాల తయారీతో కోరుట్ల పట్టణానికి ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు వందలాది మందికి ఉపాధి లభిస్తోందన్నారు. విగ్రహాల కొనుగోలు కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, తయారీదారులు, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రధాన రహదారిపై హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి తగినంత వెలుతురు కల్పిస్తే రాత్రి వేళల్లో ప్రమాదాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు వీలైనంత త్వరగా హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
