
తెలంగాణ సామ్నా డెస్క్: కొడుకుతో పాటుగా కొత్త ఇంటికి వచ్చిన తరువాత ఆమెకు అంతా కొత్తగా అనిపించింది. ముఖ్యంగా ఆర్థికపరమైన లోటు తీరింది. రేపటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా అయ్యింది. పని కూడా తగ్గింది. ఎప్పుడన్న తనను సొంత బిడ్డలా చూసుకున్న వారికి ఫోన్ చేయాలి అనిపిస్తే దగ్గరలో వున్న టెలిఫోన్ బూతుకు వెళ్లి మాట్లాడేది. అలా మరికొద్ది సంవత్సరాలు గడిచాయి. ఈలోగా అంతవరకు తమ మొఖం చూడని కొందరు బంధువులు అంతవరకు గుర్తుకురాని సంబంధాలను కలుపుకొని రావడం మొదలుపెట్టారు. ‘‘భర్త వల్ల ఇబ్బందులు పడ్డావు కాని నీ కొడుకు రాజు అయ్యిండు. ఇక నీకేం తక్కువ’’ అని చెప్పసాగారు. మెల్లిమెల్లిగా కొడుక్కి తమ కూతరును ఇస్తాము. తమ దగ్గరి బంధువుల అమ్మాయి వుందని చెబుతూ వెళ్లసాగారు. తనకేమీ తెలియదని అంతా కొడుకు యిష్టం అని చెప్పింది. కొడుకు తనకు మాత్రం ఏం తెలుసు? అంతా ‘‘నానమ్మ తాతయ్యలు’’ చూసుకుంటారు అని చెప్పాడు. దీనితో బంధువులు వారి ఇంటికి వెళ్లడం ప్రారంభించారు. వారి ఒత్తిడి తట్టుకోలేక ఒక మంచి అమ్మాయిని, స్థితిమంతుడైన కుటుంబాన్ని చూసి కొడుక్కి పెళ్లి చేశారు.
కొత్త కొడలు కాపురానికి వచ్చిన కొద్ది రోజులు బాగానే వుంది. ఉద్యోగరీత్యా కిరాయి ఇంట్లో వుండే పరిస్థితి వుండడంతో కోడలు కొంత అసౌకర్యానికి గురి అవుతున్నట్లు కనిపించేడిది. కొంతకాలం తరువాత కోడలు గర్భవతి అయి పండంటి కొడుకుకు జన్మనిచ్చింది. కొడుకు తల్లి ఆనందానికి అంతే లేదు. మనుమనికి తండ్రి పేరు పెడదామని ఆమె కొడుకుకు చెప్పింది. కాని కోడలు అస్సలు ఒప్పుకోలేదు. ఒక తాగుబోతు పేరు నా కొడుకుకు పెడితే అస్సలు సహించేది లేదు అని ఖరాఖండిగా చెప్పింది. ఆమాయకంగా కొడుకు మొఖం చూసిన ఆ తల్లికి నిరాశే ఎదురయ్యింది. అప్పటికి నుండి ఆమెకు మెల్లిమెల్లిగా కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆమె మనుమన్ని ఎత్తుకుందామని వచ్చినా వద్దనడం, స్నానం చేయిస్తానని చెప్పినా వద్దని వేరే పనిమనిషిని పెట్టడం, ఎడ్చినప్డుడు జోలపాట పాడినా సహించకపోవడం కోడలు చేసేది. కోడలు చేస్తున్న నిర్వాకం కొడుకుతో చెబితే మౌనమే సమాధానం అయ్యేది. దీనితో దిక్కుతోచక తన బాధను తన ‘తల్లిదండ్రులకు’ చెప్పుకొని బాధపడేది.
ఆమె బాధను కొడుకు పట్టించుకోక కోడలు ధిక్కార ధోరణిలో చేసే సరికి ఆమె తట్టుకోలేక పోయింది. ఎంతో ప్రేమతో చూసుకునే కొడుకు కూడా భార్య మాట వింటు తనను పట్టించుకునే పరిస్థితి రావడం ఆమె తట్టుకోలేకపోయింది. రాను రాను ఇంట్లో ఆమె పరిస్థితి ఒక దూరపు బంధువు చాలా రోజుల నుండి ఇంట్లో తిష్ఠ వేసి ఇంకా వెళ్లకపోతే ఇంటివారు ఏలా చూస్తారో అలా భార్యభర్తలు చూడడం ఆమె సహించలేకపోయింది. ముఖ్యంగా కొడుకు తనకు కనీసం సపోర్టు చేయకపోవడం ఆమెకు మరింత ఇబ్బంది కలిగించింది. ఆమె పరిస్థితి రోజురోజుకి మౌనంగా వుండాలి. ఇంటి పనంతా చేయాలి. ఏది పెడితే అది తినాలి. ఆ తరువాత ఓ గదిలోకి వెళ్లి పడుకోవాలి. అంతే. కొడుకుతో మాట్లాడుదాం అనుకున్న సమయమివ్వడు. కోడలు అయితే మాట కూడా మాట్లాడదు. మనుమన్ని ఎత్తుకొవడం, ముద్దు చేయడం ఆమెకు నిషేదం. దీనితో ఆ ఇల్లు ఆమెకు ఆ ఇల్లు అందరు వున్న నరకం అయ్యింది. ఆమె తట్టుకోలేక పోయింది. విపరీతంగా బాధపడిరది. ఆ బాధలోనే ఓ నిర్ణయం తీసుకుంది.
మరునాడు కొడుకు బడికి వెళ్లేకంటే ముందే తన పెట్టే సర్దుకుంది. కొడుకుకు నానమ్మ తాతయ్యలు గుర్తుకు వస్తున్నారు అని చెప్పి కోడలుకు వెళ్తున్నాను అని సైగ చేసి, మనమన్ని దూరం నుండే ముద్దాడి బస్సెక్కింది.
ఇంటికి వచ్చి తనకు పునర్జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులకు తన బాధ అంతా చెప్పింది. వారు నేను కొడుకును పిలిపించి మాట్లాడుతాం అని చెప్పిన వద్దంది. ఒక రెండు రోజులు గడిచిన తరువాత తన అంతకు ముందు పనిచేసిన హస్పిటల్‌కు వెళ్లి మళ్లీ పనికి వస్తానని చెప్పి ఆ క్షణమే జాయిన్ అయ్యింది. ఇంటికి వచ్చి విషయం తల్లిదండ్రులకు తెలిపింది. ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు చూసి వారు ఆశ్చర్యపోయారు. మరునాటి నుండి యథావిధిగా తన డ్యూటీకి పోవడం ప్రారంభించింది. వారం, పక్షం, నెల గడిచింది. అమ్మ ఎలా వుంది అని కొడుకు తాతకు ఫోన్ చేయలేదు. కొడుకు ఎలా వున్నాడో కనుక్కో అని ఆమె తండ్రికి కూడా చెప్పలేదు.
కాని హస్పిటల్‌లో పుట్టిన ప్రతి బిడ్డలో తన మనుమన్ని మనుమరాలిని చూసుకుంటూ ఆమె హయిగా ఒంటరిగా ప్రశాంతంగా ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా జీవనం సాగిస్తోంది.
(ఈ కథలకు ముగింపు వుండదు. మరో కథతో మళ్లీ)
