(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పట్టణ పరిసర ప్రాంతాల్లోని వాగులు జలకళను సంతరించుకున్నాయి. వర్షపు నీటితో వాగులు నిండిపోయి ప్రస్తుతం వేగంగా ప్రవహిస్తున్నాయి. దీంతో శుక్రవారం జరగనున్న గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అవసరమైనంత నీరు అందుబాటులోకి రావడంతో గణేష్ ఉత్సవ కమిటీలు, పట్టణవాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
గణేష్ నిమజ్జన కార్యక్రమానికి నీటి లభ్యతపై నెలకొన్న ఆందోళనకు భారీ వర్షం తెరదించినట్లయింది. వాగుల్లో నీటి ప్రవాహం పెరగడంతో నిమజ్జనానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని పట్టణవాసులు భావిస్తున్నారు.
అయితే నీటి లభ్యతతో పాటు భద్రతపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వాగుల్లో ప్రవాహం వేగంగా ఉండటంతో నిమజ్జన సమయంలో నిర్వాహకులు, భక్తులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా చిన్నారులను వాగులు, నీటి ప్రవాహానికి సమీపంలోకి వెళ్లకుండా చూడటం అత్యంత కీలకం.
నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లడం, ప్రవాహం మధ్యలోకి దిగడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. గణేష్ నిమజ్జన వేడుకలను ఉత్సాహంగా నిర్వహించడంతో పాటు ప్రతి ఒక్కరి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పట్టణవాసులు కోరుతున్నారు.
