(తెలంగాణ సామ్నా డెస్క్)
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా చెప్పబడుతున్న దేవ్జి తెలంగాణ ఎస్ ఐ బి పోలీసుల ముందు లొంగిపోయినట్టుగా సమాచారం వస్తున్నది.
మావోయిస్టు విప్లవ ఉద్యమ ప్రస్థానంలో ఈ స్థాయి వ్యక్తిగా ప్రచారం ఉన్న వ్యక్తి లొంగిపోవడం సంచలనమే. ఆపరేషన్ కగార్ మొదటి విడత లో కొంత విరామం ప్రకటించి కేంద్ర ప్రభుత్వం రెండవ విడతగా రెండు రోజుల క్రితం కగార్ టు పేరున పోలీస్ కూంబింగులు తీవ్రతరం చేసిన నేపథ్యంలో దేవ్జీ సరెండర్ అయ్యారన్న వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తిరుపతి అలియాస్ దేవ్జి 1984 ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమంలో అండర్ గ్రౌండ్ గా వెళ్ళాడు. అంతకుముందు కాలేజీలో రాడికల్ విద్యార్థి సంఘంలో చురుకుగా పనిచేశాడు.
అప్పటి విద్యార్థి రాజకీయాల నేపథ్యంలో ఏబీవీపీ ఆర్ఎస్ మధ్యలో సైద్ధాంతిక , వ్యక్తిగత దాడులు జరిగేవి. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన కొందరు విద్యార్థులు అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయారు. వీరిలో ముక్క వెంకటేశం, ఎండి నిజాముద్దీన్, తిప్పరి తిరుపతి ముఖ్యులు. కొందరు ఉద్యమ నేపథ్యంలో లొంగిపోగా మరికొందరు ఎన్కౌంటర్ కాగా తిప్పిరి తిరుపతి మటుకు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడన్న ప్రచారం జరిగింది. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి సరెండర్ కావడం అనే సంచలన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
తిప్పిరి తిరుపతి ప్రాణానికి ఎలాంటి హాని తల పెట్టవద్దని ఆయన తమ్ముడు తమ్ముని కూతురు పత్రికాముఖంగా సోషల్ మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు.తిప్పిరి తిరుపతి సరెండర్ తో మావోయిస్టు ఉద్యమం అంతిమ దశకు వచ్చిందన్న అంచనాలు వస్తున్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి తో పాటుగా మరో పదహారు మందితో కలిసి తిరుపతి తెలంగాణ స్పెషల్ బ్రాంచ్ ముందు లొంగిపోగా మిగిలిన మరికొందరు కూడా త్వరలో ప్రభుత్వానికి సరెండర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్న అంచనాలు వస్తున్నాయి.
నిజాముద్దీన్ ఎక్కడ?
తిప్పిరి తిరుపతి తో పాటుగా విద్యార్థి దశలోనే నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లిన మరో ఇద్దరి గురించి ప్రస్తుతము చర్చ నడుస్తుంది. అందులో ఒకరు ముక్క వెంకటేశం కాగా, రెండవ వ్యక్తి నిజాముద్దీన్. వీరు ముగ్గురు కూడా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందినవారు. ముక్క వెంకటేశం నల్గొండ జిల్లా కార్యదర్శి హోదాలో ఎన్కౌంటర్లో మరణించగా , మరొక వ్యక్తి నిజాముద్దీన్ ఎక్కడ ఉన్నాడన్న విషయము సస్పెన్స్ గానే ఉంది. ఉద్యమంలో ఉన్నాడా? ఉద్యమాన్ని వదిలి ఎక్కడైనా ఉద్యమానికి సంబంధం లేకుండా రహస్య జీవితం గడుపుతున్నాడా? లేదా ఇంకేదైనా అనుకోని విషయం జరిగిందా? అన్న విషయంపై స్థానికంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. నిజాముద్దీన్ తో పాటు మరికొందరు మావోయిస్టులు కూడా దశాబ్దాల కాలంగా ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది
మావోయిస్టు ఉద్యమ చరిత్రలో అత్యంత చర్చ నీ అంశమైన లొంగుబాటు తిప్పిరి తిరుపతిదిగా చర్చించుకుంటున్నారు.
