(బాలే అజయ్ – 9290277727)
కోరుట్ల, జూన్ 20: కోరుట్ల పట్టణంలోని 7వ వార్డు పెద్దగుండు అయోధ్యపట్టణంలో గత నెల రోజులుగా త్రాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలకు ఊరటనిచ్చేలా నూతన బోరు ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో ఉన్న త్రాగునీటి బోరు పాడైపోవడంతో పాటు మట్టి కూరుకుపోవడం వల్ల నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సుమారు 60 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
స్థానిక ప్రజల సమస్యను గుర్తించిన వార్డు కౌన్సిలర్లు గూగులవత్ శ్రీకాంత్, గుద్దేటి రాజేందర్ ఆధ్వర్యంలో, కాలనీవాసులు సమస్యను మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను పరిశీలించిన అధికారులు వెంటనే స్పందించి నూతన బోరు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా శనివారం కొబ్బరికాయ కొట్టి నూతన బోరు తవ్వక పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో గుద్దేటి రాజేందర్, దండుగుల తిమ్మయ్య, పల్లపు రాజం, రాజేందర్, రాజు తదితర కుల పెద్దలు, స్థానిక నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
ఎన్నో రోజులుగా త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న తమకు సమస్య పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, మున్సిపల్ కమిషనర్, వార్డు కౌన్సిలర్లు గూగులవత్ శ్రీకాంత్, గుద్దేటి రాజేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
