
తెలంగాణ సామ్నా డెస్క్: బిఆర్‌ఎస్ పార్టీ గుర్తుపై ఆసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మేల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు పంపారు. దీనితో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కాయి. ఇంతవరకు స్పీకర్ పరిధిలో, న్యాయస్థానాల్లో నానుతున్న ఎమ్మేల్యేల అనర్హత వ్యవహరం సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లిన తరువాత వేగం పుంజుకుంది. పార్టీ మారిన బారాస శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు శాసనసభ కార్యదర్శిని నిలదీసినంత పనిచేసింది. దీనితో తప్పనిసరి పరిస్థితిలో కార్యదర్శి బారాస ఎమ్మేల్యేలకు నోటీసులు ఇవ్వాల్సివచ్చింది. అయితే ఈ నోటీసులకు వివరణ ఇవ్వడానికి కొంత సమయం కావాలని ఎమ్మేల్యేలు కోరారు.
అయితే చట్ట ప్రకారం వ్యవహరించే క్రమంలో కేవలం కండువా కప్పుకుంటేనే పార్టీ మారినట్టా? అనే చర్చ వస్తున్నది. మర్యాద పూర్వకంగా మంత్రుల్ని, ముఖ్యమంత్రిని కలిస్తేనే పార్టీలో చేరినట్టా? అనే వాదన కూడా వస్తున్నది. కాంగ్రెస్‌లో చేరినట్లు అధికారికంగా ఎక్కడా సభ్యత్వం తీసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు లేవనే చర్చ వస్తున్నది. దీనితో పాటుగా స్పీకర్ తీసుకునే నిర్ణయం, పార్టీ మారినట్టు బారాస ఆరోపిస్తున్న శాసనసభ్యుల వివరణకు తీసుకునే సమయంతో పాటుగా చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం వచ్చే సమస్యల వల్ల ఈ కేసు మరికొన్ని నెలలు సాగదీసే అవకాశాలు పుష్కలంగా వున్నయన్న వాదన వస్తున్నది.

