(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
ముత్యంపేట నిజాం చక్కెర కర్మాగారాన్ని వెంటనే తెరిపించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు, చెరుకు రైతులకు టన్నుకు రూ.400 రవాణా చార్జీలు చెల్లించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి, ఎన్డీఎస్ఎల్ సభా సంఘం చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కోరారు.
హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బుధవారం నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంత్రి శ్రీధర్‌బాబును జువ్వడి కృష్ణారావు కలిసి చెరుకు రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఇటీవల కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో, జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు ఘాజంగి నందయ్యతో కలిసి జువ్వడి కృష్ణారావు ఎస్ఐఆర్ కార్యక్రమాల అమలుతీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలతో నిర్వహించిన పునఃశ్చరణ కార్యక్రమంలో స్థానిక చెరుకు రైతులు తమ సమస్యలను జువ్వడి కృష్ణారావు దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన రైతులకు హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి శ్రీధర్‌బాబును కలిసి రైతుల సమస్యలను వివరించారు. ముత్యంపేట నిజాం చక్కెర కర్మాగారం పరిధిలో చెరుకు సాగు చేస్తున్న రైతులు ప్రస్తుతం చెరుకును దూర ప్రాంతంలోని కామారెడ్డి ఫ్యాక్టరీకి తరలించాల్సి రావడంతో రవాణా ఖర్చులు తీవ్ర భారంగా మారుతున్నాయని తెలిపారు. దీనికితోడు చెరుకు రవాణా దూరం పెరగడం వల్ల చక్కెర రికవరీ శాతం కూడా తగ్గుతోందని వివరించారు.
రైతులపై పడుతున్న అదనపు భారాన్ని దృష్టిలో ఉంచుకుని చెరుకు టన్నుకు రూ.400 రవాణా చార్జీలు ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జువ్వడి కృష్ణారావు కోరారు. అదే విధంగా ముత్యంపేట నిజాం చక్కెర కర్మాగారాన్ని వెంటనే పునఃప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీధర్‌బాబును విజ్ఞప్తి చేశారు.
రైతుల సమస్యలను సానుకూలంగా విన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు జువ్వడి కృష్ణారావు తెలిపారు.
