35.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

అవకాశం కోసం కాదు… సేవ కోసం ఓం ప్రకాష్

(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)

వికలాంగతను తన బలహీనతగా కాకుండా, సేవకు ప్రేరణగా మార్చుకున్న వ్యక్తి చెట్టిపల్లి ఓం ప్రకాష్. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్ అయిన ఆయన, మున్సిపల్ కౌన్సిలర్ పదవికి ఎన్నికల బరిలో నిలిచి ప్రజల మనసులు ఆకట్టుకుంటున్నాడు.
ఏళ్లుగా ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తూనే, తన వాడలోని ప్రజలకు అవసరమైన వేళ అందుబాటులో ఉండడం ఓం ప్రకాష్‌కు అలవాటే. వికలాంగులు ఎదుర్కొనే సమస్యలు తన జీవితానుభవంలోనే తెలుసుకున్న ఆయన, అవే సమస్యలకు స్వరం కావాలన్న ఆలోచనతో ఎన్నికల రంగంలోకి అడుగుపెట్టాడు.
ప్రజాసేవ ఆయనకు కొత్తది కాదు. పెండ్లిళ్లు, ఫంక్షన్లలో భోజనాలు మిగిలితే, పని వదులుకుని తన సొంత ఖర్చులతో ఆటోలో అక్కడికి వెళ్లి మిగిలిన అన్నం, కూరలను తీసుకువచ్చి బీదవారికి పంచిపెట్టేవాడు. ఇది ఒకటి, రెండు సార్లు కాదు… ఆయన నిత్య జీవనంలో భాగమైన సేవగా స్థానికులు చెబుతున్నారు.
అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డుపై ఒంటరిగా నడుస్తున్న వృద్ధులు కనిపిస్తే,
“అమ్మా…, బాపూ… కూర్చో” అని ఆత్మీయంగా పిలిచి ఆటోలో కూర్చోబెట్టుకుని, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వారు చేరాల్సిన చోటికి ఉచితంగానే తీసుకెళ్లేవాడు. ఈ చిన్నచిన్న మానవీయ చర్యలే ఓం ప్రకాష్‌ను ప్రజలకు దగ్గర చేశాయి.
ఇప్పుడు అదే సేవా భావంతో మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన ఆయన, తన వాడలో ఇంటింటికి తిరుగుతూ,
“వికలాంగుడైన నాకు అవకాశం ఇస్తే, వికలాంగులకే కాదు… ప్రతి ఒక్కరికీ సేవ చేస్తాను. అమ్మా… నాకు ఓటు వేయండి” అంటూ ఓటర్లను ఆత్మీయంగా కోరుతున్నాడు. మాటల్లో ఆర్భాటం లేదు, పెద్ద హామీలు లేవు… కానీ గతంలో చేసిన సేవలే ఆయనకు ప్రచారంగా మారాయి.
అతనికి మద్దతుగా ఇతర వికలాంగులు కూడా ముందుకు వచ్చి బైక్‌పై అతని వెంట తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో భాగమవుతున్నారు. ఇది కేవలం ఒక అభ్యర్థి పోటీగా కాకుండా, తమలాంటి వారికి ప్రతినిధిత్వం కావాలన్న ఆశగా మారిందని వారు చెబుతున్నారు.
సాధారణ ఆటో డ్రైవర్‌గా జీవితం సాగిస్తూ, సేవనే తన లక్ష్యంగా మార్చుకున్న చెట్టిపల్లి ఓం ప్రకాష్ ప్రయాణం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలు అతని నిజాయితీని, మానవీయతను ఎలా ఆదరిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles