(తెలంగాణ సామ్నా డెస్క్)
మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ మంగళవారం తెలంగాణ డిజిపి శివధర్‌రెడ్డి ముందు లొంగిపోయారు. ఆయనతో పాటుగా కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహరెడ్డి, చొక్కారావులు కూడా ఆజ్ఞాతం వీడి జనజీవనంలోకి వచ్చారు. ఈ సందర్భంగా డిజిపి మట్లాడుతూ ఆజ్ఞాతంలో వున్న మిగితా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆజ్ఞాతంలో వున్న వారిలో కొందరు తమతో చర్చిస్తున్నారని ఆయన తెలిపారు. లొంగిపోయిన తరువాత తిరుపతి మాట్లాడుతూ తాను అనారోగ్య సమస్యలతోనే అజ్ఞాతం వీడానని తెలిపారు. తొందరలోనే రాజకీయాల్లోకి వస్తానని తెలిపాడు. మరో సెంట్రల్ కమిటీ సభ్యుడు మావోయిజం అంతం కాదని, తాను ప్రజా సమస్యలపై పోరాడుతానని తెలిపారు.
కీలక మలుపు దిశగా మావోయిస్ట్ ఉద్యమం!
మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి సహ నలుగురు మంగళవారం తెలంగాణ డిజిపి ముందు లొంగిపోయిన తదనంతరం మావోయిస్టు ఉద్యమం భవిష్యత్తుపై చర్చ ప్రారంభం అయ్యింది. భవిష్యత్తులో లొంగిపోయిన మావోయిస్టులు రాజకీయాల్లో వుంటామని ప్రకటించడం, మరికొందరు ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్దంగా పనిచేస్తామని తెలపడం ద్వారా మావోయిస్టులు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయా రాష్ట్రాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించే అవకాశం వుందన్న ఊహగానాలు వస్తున్నాయి.
లొంగిపోయిన వారు ఒక పార్టీని కొత్తగా నిర్మాణం చేసి ప్రత్యక్ష ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి వస్తారా? లేక ఇప్పుడు వున్న ఏదేని ఒక రాజకీయ పార్టీలో చేరతారా? అనే చర్చ మొదలైంది. దేశవ్యాప్తంగా రాజకీయపరంగా చర్చకు దారితీసిన మావోయిస్టు ముఖ్యుల లొంగుబాటుతో పాటుగా గతంలో ‘ఆపరేషన్ కగార‘ సమయంలో లొంగిపోయిన మావోయిస్టులు అంతా కలిసి ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య విలువలతో రాజకీయంలో వుంటారా? లేక ఎవరికి వారుగా సొంత నిర్ణయాలతో ముందుకు వెళతారా? అనేది ఇప్పుడిప్పుడే చెప్పలేరనే వాదన వస్తున్నది.
మావోయిస్టు ఉద్యమ పరంగా మంగళవారం నాటి లొంగుబాట్లు అతిపెద్ద దెబ్బ అనే చాలామంది విశ్లేషకులు అంటున్నారు. ఇక భారతదేశంలో మావోయిస్టు ఉద్యమం పూర్తిగా నీరుగారి పోవడమో లేక ప్రజాస్వామ్యబద్దంగా కొత్త దారిని వెతుక్కోవడమో చేస్తుందనే వాదన వస్తున్నది.
