
తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షునిగా ముఖ్యంగా ముగ్గురిని కేంద్ర నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. మెదక్ ఎంపి రఘనందన్రావ్, మల్కాజిగిరి ఎంపి ఈటెల రాజేందర్, మహబూబ్‌నగర్ ఎంపి డికే ఆరుణ పేర్లు ఇందులో ప్రధానంగా వినిపిస్తున్నవి. వీరు ముగ్గురే కాకుండా ఉత్తర తెలంగాణకు చెందిన మరో ఎంపి కూడా అధ్యక్షుని రేసులో వున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అధ్యక్ష రేసులో వున్న నలుగురు కూడా ఎంపిలే కావడం గమనార్హం. ఈ నలుగురిలో కేంద్ర నాయకత్వం ముగ్గురి అభ్యర్థిత్వాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.
డికే ఆరుణ విషయానికి వస్తే సమర్ధవంతమై నాయకత్వ లక్షణాలు కలిగి వున్న మహిళా నాయకురాలు. పరిపాలన పరమైన లోటుపాట్లు తెలిసిన మహిళ. అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం వున్న మహిళగా గుర్తింపుపొందింది. అయితే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా వున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలే అధ్యక్షులుగా వుంటే ఎలా వుంటుంది అనే కోణంలో ఆలోచిస్తున్నట్లు వినికిడి.

మరో పరిశీలనలో వున్న ఈటెల రాజేందర్ కూడా నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న వ్యక్తి. బిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటుగా అందరిని అక్కున చేర్చుకునే వ్యక్తిత్వం వున్న నాయకునిగా గుర్తింపు వుంది. దీనితో పాటుగా తెలంగాణ రాజకీయాల పట్ల పూర్తి అవగాహన, బారాస శ్రేణులతో వున్న పాత పరిచయాలు పార్టీకి భవిష్యత్తులో ఉపయోగ పడే అవకాశాలు వుండే అవకాశం వుంది. అంతేకాకుండా తెలంగాణలోని బిసి శ్రేణుల్ని పార్టీకి అనుకూలంగా మలిచే సత్తా వున్న నాయకుడు ఈటెల రాజేందర్‌ను కేంద్ర నాయకత్వం గుర్తించి పరిశీలిస్తుందని తెలుస్తున్నది.

మూడవ పరిశీలనలో రఘునందన్ రావ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. లాయర్‌గా చట్టాల మీద మంచి పట్టు వుండడం, మంచి వాగ్దాటి, ఎంతటి కఠినమైన సమస్యనైనా పరిష్కరించే సత్తా వున్న నాయకునిగా రఘునందన్రావ్కు గుర్తింపు వుంది. తన పటిమతో ఇప్పటికే జాతీయ స్థాయి నాయకులను మెప్పించినట్లు తెలుస్తున్నది. ఉత్తర తెలంగాణలో బీజేపికి వున్న ఊపును కాపాడుకుంటూనే దక్షిణ తెలంగాణలో పాగా వేస్తూ, ఖమ్మం,నల్గోండ జిల్లాలో పార్టీ జెండాను రెపరెపలాండిచే నాయకత్వ లక్షణాలున్న కార్యకర్తకోసం బీజేపి విస్త్రతంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.
వీరే కాకుండా ఒంటెద్దు పోకడలతో, మోడీ, అమిత్‌షాల పేర్లు చెప్పి ఓట్లు కొల్లగొడుతున్న మరికొందరు నాయకులు కూడా తమకే అధ్యక్ష పదవి అప్పగించాలని డిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీ ఎవరిని ఎంపిక చేసినా అందరు విధిగా ఒప్పుకుని పాటించే అవకాశాలు వున్న నేపథ్యం బీజేపిలో కనిపిస్తుంది. అందుకే కేంద్ర అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుంది అనే ఆంశంపై రాష్ట్ర బీజేపి నాయకుల్లో, కార్యకర్తల్లో ఊహగానాలు పెరుగుతున్నాయని చెప్పవచ్చు.
