36.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

ఆస్థి కోసం తండ్రి శవాన్ని ఇంటిముందే వుంచిన కొడుకు

తెలంగాణ సామ్నా డెస్క్‌” ‘‘తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమీ వాడు గిట్టనేమీ… పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా’’ అన్నాడొక కవి. అలాంటి కొడుకు కథే ఇది. ఆ కొడుకుకు సంబంధించిన కథే ఇది. వివరాల్లోకి వెళితే…. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏవడునూతల గ్రామంలో ఈ ఆమానవీయ ఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన వెలికట్టే యాదగిరి ఇద్ధరు భార్యలు. అంతో ఇంతో ఆస్థి వున్నవాడు. మొదటి భార్యకు ఒక కుమారుడు. రెండవ భార్యకు ఒక కొడుకు, కూతురు. తమ సంతానానికి తన వద్ధ వున్న ఆస్థిని సమాన భాగాలు చేసి తలా ఐదు ఎకరాలు పంచేశాడు యాదగిరి. ఈ క్రమంలో రెండవ భార్య కొడుకు ఈ మధ్యనే కాలం చేశాడు. అయితే అతనికి భార్య, పిల్లలు లేకపోవడంతో అతని తాలూకా ఐదు ఎకరాల ఆస్థిని రెండవ భార్య తన కూతురు పేరున రాసింది. అయితే తన కుటుంబ అవసరాల కోసం కూతురు మూడు ఎకరాలు అమ్ముకోగా రెండు ఎకరాలు మిగిలింది.

ఇంతవరకు సజావుగానే సాగినట్లు ఈ సంఘటన కనిపించినా.. మూడు రోజుల క్రితం మలుపు తిరిగింది. తండ్రి యాదగిరి చనిపోయాడు. మరణించిన తండ్రికి కొడుకు తలకొరివి పెట్టడం సాంప్రదాయం. బాధ్యత పరంగానైనా, ఆచారాల ప్రకారమైన కొడుకు తండ్రికి తలకొరివి పెట్టాలి. కాని కొడుకు కూతురు పేరన రాసి ఇచ్చిన ఐదు ఎకరాల్లోంచి అమ్ముకోగా మిగిలిన రెండు ఎకరాలు తన పేరున రిజిష్ట్రేషన్‌ చేస్తేనే తాను తలకొరివి పెడతానని భీష్మించుకు కూర్చున్నాడు. పోనీ ఒక కొడుకు వినకపోతే ఇంకొక కొడుకుతో తలకొరివి పెట్టింద్దాం అంటే ఆ అవకాశం లేదు. రెండవ భార్య కొడుకు గతంలోనే చనిపోయాడాయే. గ్రామపెద్ధలు వచ్చారు. సమస్యను పరిష్కరించడానికి కృషి చేశారు. రెండు వైపులా చెప్పి చూశారు. రెండు ఎకరాలు ఇవ్వాల్సిందే అని కొడుకు, ఇచ్చేదే లేదని కూతురు పట్టుకు కూర్చున్నారు.ముందైతే యాదగిరి అంత్యక్రియలు పూర్తి చేద్దాం. తరువాత ఆస్థి గురించి మాట్లాడుదాం అని గ్రామపెద్ధలు, బంధువులు ఎందరు చెప్పినా ఇద్దరిలో ఏ ఒక్కరు ఒక్క మెట్టు కూడా దిగిరాలేదు.

మూడు రోజులుగా తండ్రి శవాన్ని డీఫ్రీజ్‌లో చల్లగానే వుంచబడుతోంది కాని బయట అన్నా చెల్లెళ్లు వేడివేడిగా ఒకరి మీద ఒకరు మాటల మట్టి చల్లుకుంటున్నారు. తండ్రి మరణించి మూడు రోజులు అయ్యింది. ఆ శవం అలాగే వారి పంతంలాగే డీఫ్రీజ్‌లో పెట్టబడి వుంది. ముగ్గురిలో ఒక్కరు చనిపోతే మిగిలిన ఇద్ధరు తండ్రి ఆస్థి 15 ఎకరాలు చెరి సగం తీసుకోవాలి అనేది ఒకరి పంతం అయితే… ముగ్గురికి సమాన భాగాలు చేసి ఇచ్చిన తరువాత తన అన్న ఆస్థి తనకే చెందుతుందని ఇంకొకరి వాదన. అలా ఏలా చెందుతుంది? అని ఒకరంటే, అలాగే చెల్లుతుంది అని ఇంకొకరి సవాల్‌. మొత్తానికి తండ్రి శవాన్ని మూడు రోజులుగా ‘‘చల్లటి డబ్బా’’లో పెట్టేసి అన్న చెల్లి చేసుకుంటున్న హట్‌హట్‌ గొడవలు స్థానికంగానే కాదు. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

చనిపోయిన తమ్మునికి చెందిన పొలాన్ని ఇద్ధరు పంచుకోవాలా? లేక చెల్లియే మొత్తం తీసుకోవాలా? అనే వాదనలకు అందని తర్కాన్ని పట్టనబెడితే కొడుకుగా ఓ తండ్రికి చేయాల్సిన చివరి కర్మను చేయడానికి ఆస్థిని అడ్డంపెట్టుకోవడం అనేదే ఇబ్బందికర విషయని చాలామంది విచారం వ్యక్తం చేస్తున్నారు. తన సంతానంకు ఎలాంటి కష్టాలు రాకుండా సంతోషంగా బ్రతకడానికి తనవంతుగా కృషి చేసిన ఓ తండ్రి బౌతికకాయం మూడు రోజులుగా ఇంటిముందు వుండడం మటుకు అమానుషమైన చర్యగా చాలామంది చెబుతున్నారు. మసిపడుతున్న మానవీయ బంధాలకు ఇదోక ఉదహరణగా చాలామంది చెబుతున్నారు.
ఈ కేసు ఇలా అయితే పూర్తవ్వదని స్థానిక పోలీసులకు గ్రామస్థులు తెలిపినట్లు సమాచారం. యాదగిరి శవం పోలీసులు వచ్చాకా కట్టేల మీదికి పోయి కాలిపోతుందేమో… కాని చితిమంటలు ఆరాకా ఆ ఇంట్లో రగిలే బంధాల కుంపట్లు మంటలు రాజుకుంటాయా? అగిపోతాయా?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles