(బాలే అజయ్ – 9290277727)
జగిత్యాల జిల్లా, కోరుట్ల పట్టణంలో గంజాయి వినియోగం, అక్రమ విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో కొందరు గంజాయి సేవిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు, ఎస్ఐ చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసు బృందం, ప్రభుత్వ పంచుల సమక్షంలో అకస్మాత్తుగా దాడి నిర్వహించింది.
ఈ రైడ్‌లో అక్కడ గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులు — అబ్దుల్ ఉమేర్, షేక్ ఆరిఫ్ ఖాన్ —లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా, కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా గంజాయి అలవాటు పడ్డ వీరు, కోరుట్ల పట్టణంలో మామిడికాయల బండిలో పనిచేసే కృష్ణ జూంబేకర్ (33), అమరావతి జిల్లా, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి, తాము వినియోగించడమే కాకుండా ఇతరులకు కూడా విక్రయిస్తున్నట్లు అంగీకరించారు.
దీంతో వెంటనే స్పందించిన పోలీసులు, కృష్ణ జూంబేకర్‌ను కూడా అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి సుమారు 80 గ్రాముల గంజాయి, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ చిరంజీవి వెల్లడించారు.
