(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీ వాసులు శ్రీ దేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వార్షిక బ్రహ్మోత్సవాలు, జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తుల రాకపోకలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది.ఉత్సవాల్లో భాగంగా క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వేదమంత్రాల నడుమ ఘనంగా జరిగింది. పండితుల మంత్రోచ్ఛారణలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు భక్తులను ఆహ్లాదపరిచాయి. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.మధ్యాహ్నం స్వామివారి పారాయణం, తీర్థ ప్రసాదాల పంపిణీ, అన్నప్రసాద కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా కొనసాగింది. సాయంత్రం స్వామివారి పల్లకి ఊరేగింపు అర్బన్ కాలనీ వీధులలో భక్తుల హర్షధ్వానాల మధ్య వైభవంగా నిర్వహించబడింది. వేదఘోషాలు, మంగళ వాయిద్యాలు, దీపాల వెలుగులతో సాగిన ఈ ఊరేగింపు కార్యక్రమం ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.జాతర సందడి, భక్తుల తాకిడి, రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు, యువజన సంఘాల పాల్గొనికతో అర్బన్ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తి, ఆనందం, ఐక్యతల సమ్మేళనంగా జరిగిన ఈ బ్రహ్మోత్సవాలు కోరుట్ల పట్టణంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి.

