37.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

“నేటి భారతం”

అనగనగా అవంతీ రాజ్యం వుండేడిది. ఆ దేశరాజు ఎంతో సౌమ్యుడు. తాను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్న ప్రజల అభిప్రాయం తెలుసుకొని ఏ అభిప్రాయానికి ఎక్కువ మంది ప్రజలు మద్ధతు తెలుపుతారో దానినే అమలుపరిచే విశాలగుణం వున్నవాడు. తనలాగే అన్ని గ్రామాల్లో, పరగణాల్లో ఇలాంటి నియమమే పాటించాలని ఆజ్ఞ జారీచేశాడు అంటే ఆ రాజు ఎంత గొప్పవాడో ఆర్థం చేసుకోవచ్చు. ప్రజల మెప్పులేని ఏ శాసనం కూడా శాశ్వతంగా నిలవదని ఆ రాజు నమ్మేవాడు.


ఆ రాజ్యంలోని ఓ గ్రామంలో ధర్మయ్య, భారతమ్మ అనే దంపతులు వుండేవారు. ఆ గ్రామం మొత్తం పాడిపంటలతో కళకళలాడుతూ వుండేడిది. ఆ గ్రామంలో భారతమ్మ కుటుంబమే ఆ గ్రామానికి పెద్ద దిక్కుగా వుండేడిది. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నింటికి ముందుగా నిలబడి మాట సహయం, మర్యాద సహయంతో పాటుగా ఆర్థిక సహాయం ఆ కుటుంబం చేసేడిది. దానితో ఆ గ్రామంలో వారంటే ప్రత్యేకమైన గౌరవం వుండేడిది. ఆ గ్రామంలో ఏ కలత వచ్చినా ఎవరి కంట్లో కన్నీరు వచ్చినా భారతమ్మకు తెలవాల్సిందే లేదా చెప్పాల్సిందే. చెప్పిన వెంటనే ఆ సమస్య పరిష్కారం కావాల్సిందే. అంతగా ఆ గ్రామంలో భారతమ్మ కుటుంబానికి పలుకుబడి వుండేడిది.

ఒకరోజు ఆ గ్రామానికి పరాయి దేశం నుండి ఒక వ్యక్తి తన భార్యను తీసుకొని వచ్చాడు. తాను భార్యతో సహ బ్రతకడానికి ఆ గ్రామానికి వచ్చినానని, ఎలాగైనా తనకు తన భార్యకు ఇంత అన్నం పెట్టి పని చూపించమని గ్రామ చావడిలో పెద్ధలను వేడుకున్నాడు. ఈ గ్రామం ఆదుకోకపోతే తను భార్యతో సహ మరణించడం తప్ప వేరే మార్గం లేదని భోరున ఏడ్చాడు. ఆ వ్యక్తి బాధ చూడలేక గ్రామపెద్ధలు భారతమ్మ విషయం చెప్పి ఎదైనా సహయం చేయమని కోరారు. భారతమ్మ ధర్మయ్యతో విచారించి ఇంత పాడిపంట వున్న ఈ గ్రామంలో ఆ వ్యక్తికి రెండుపూటల భోజనం దొరకకుండా వుంటుందా? అని చెప్పి తమ ఆవుల మందను రోజు గ్రామశివారులోకి మేతకు తీసుకువెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకువచ్చే పని ఇచ్చింది. అలాగే ఆ దంపతులు వుండడానికి తన ఇంట్లోనే రెండు గదులు ఇచ్చింది. ఆ వ్యక్తి భార్య కూడా విశాలమైన ఆ ఇంట్లో పనికి కుదిరింది.


భారతమ్మకు ఇద్ధరు కుమారులు. వారికి భోజనం తినిపించడం, లాలించడం లాంటి పనులు కూడా ఆ వ్యక్తి భార్య చేసేడిది. కొద్ది సంవత్సరాలు గడిచాయి. ఆ వ్యక్తికి కూడా ఆ గ్రామంలో పరిచయాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఆ వ్యక్తికి కూడా సంతానం అయ్యింది. ముగ్గురు కొడుకులు. ఇద్ధరు బిడ్డలు కలిగారు. వీరందరి అల్లరితో ఆ ఇల్లు ఎప్పుడు సందడిగా వుండేడిది. అలాగే ఆ ఇంట్లో పాడిపంటకు కొదువ లేదు కాబట్టి వారే కాకుండా ఎవ్వరు ఆకలితో ఆ ఇంటికి వచ్చినా భారతమ్మ కాదనకుండా కడుపునిండా భోజనం చేయించి రానుపోను భత్యం ఇచ్చి పంపించేడిది.


మరికొంత కాలం అయ్యాకా, భారతమ్మ ఇద్దరు కొడుకులు ఉన్నత విద్యనభ్యసించడానికి రాజధానికి వెళ్లారు. వారిద్ధరు రాజధానికి ఉన్నత విద్యఉ అభ్యసించడానికి వెళ్లడం అనేది ఆ గ్రామంలోనే చర్చకు దారితీసింది. కొడుకుల పట్ల ఆ తల్లిదండ్రులకు వున్న శ్రద్ధను ఆ గ్రామస్థులందరు ఆదర్శంగా తీసుకోవాలని చాలామంది అనుకున్నారు. మరికొందరు అంతగా స్థితిమంతులుగా వున్నవారు ఎవరైనా తమ పిల్లలను ఉన్నత చదువులకు పంపిస్తారు కాని మాములు వ్యక్తులకు అది సాధ్యం కాదు అని గుసగుసలాడుకున్నారు. భారతమ్మ ఇద్ధరు కొడుకులు చదువుల కోసం వెళ్లిన తరువాత ఆ ఇంట్లో కొంత సందడి తగ్గింది. దానితో పాటు అదే ఇంట్లో వుంటున్న ఆ వ్యక్తి సంతానం అల్లరి ఎక్కువైంది. పిల్లలను విద్యాభ్యాసం కోసం గురుకులాలకు పంపమని భారతమ్మ ఎంత చెప్పినా ఆ వ్యక్తి వినలేదు. మాకెందుకమ్మ ఆ చదువులు అని అనేడివాడు

.
కాలం మరికొంత ప్రయాణం చేసింది. ఆ వ్యక్తి కొడుకులను అదే గ్రామంలో రథాలు సరిచేసే పనికి, గ్రామంలో నిత్యం పాలు సరఫరా చేసే పనికి, దేవాలయాల ముందు పూలు పండ్లు అమ్ముకునే పనుల్లో చేర్పించి నేర్పించసాగాడు. భార్య యథావిధిగా భారతమ్మ ఇంట్లో పనిచేసేడిది. వారి కూతుళ్లు ఆమెకు సహయం చేసేడిది. ఆ వ్యక్తి కూడా ప్రతిరోజు ఆవులను మేతకు తీసుకెళ్లి తీసుకువచ్చేవాడు. కొద్ది సంవత్సరాలు గడిచిన తరువాత భారతమ్మ ఇంట్లో ఓ సంతోషకరమైన సంఘటన జరిగింది. భారతమ్మ ఇద్ధరు కొడుకులు ఉన్నత చదువులు చదివి ఉత్తీర్ణులయ్యారు. అంతేకాకుండా ఆ రాజు గారు పెట్టే అన్ని పొటీ పరీక్షలు నెగ్గి ఒక కొడుకు దండనాయకులు మరియొకరు రాజ్యనాయకులుగా నియమించబడ్డారు. ఈ వార్త తెలిసిన తరువాత భారతమ్మ కుటుంబమే కాదు, ఆ గ్రామం మొత్తం సంబరాలు చేసుకుంది. భారతమ్మ ఇద్ధరు కొడుకులు రాజ్యంలోనే ఉన్నతమైన పదవులకు ఎన్నికకావడం అంటే సామాన్య విషయం కాదని వారిని వేన్నోళ్ల పొగిడారు. భారతమ్మ, ధర్మయ్య ల అనందానికి అంతేలేదు. గ్రామంమొత్తంను పిలిచి సంబరాలు చేసుకున్నారు. అందరికి విందు భోజనం ఏర్పాటు చేశారు.
(తరువాయి రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles