(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే…
ఉదయం సుమారు 5:40 గంటల సమయంలో కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట ప్రాంతానికి చెందిన కళ్లెం లింగవ (63) అల్లమయ్య గుట్టలోని జవహర్ నవోదయ స్కూల్ ముందు రోడ్డు దాటుతున్న సమయంలో, కోరుట్ల నుండి వేములవాడ వైపు వెళ్తున్న హీరో గ్లామర్ బైక్‌ను నడుపుతున్న యువకుడు అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడిపి ఆమెను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో లింగవ తలకు మరియు ఎడమ కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అయితే మార్గమధ్యలో కోరుట్ల బస్టాండ్ సమీపానికి చేరుకునేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
మృతురాలి కుమారుడు కళ్లెం రామచందర్ (29) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.
