(నిన్నటి తరువాయి)
కొడుకులు ఆ స్థాయికి ఎదిగారని ఆ దంపతులు ఆనందపడని క్షణాలు లేవు. కొడుకులిద్ధరికి సన్మానాలు, సత్కారాలు చేస్తూ వారిని స్పూర్తిగా తీసుకోవాలని గురుకులాల్లో, యువజన వేదికల్లో సన్మానాలు, సత్కారాలు చేస్తుంటే ఆ దంపతులకు ఆనందబాష్పాలు వచ్చేవి. రాజుగారు కూడా వారి ప్రవర్తనకు మెచ్చి వారిని సత్కరించి వారి గ్రామం వున్న పరిగణ ప్రాంతానికే ఒకరిని పరిగణనాయకునిగా మరొకరిని దండనాయకులగా నియమించాడు.
కొంత కాలం గడిచాకా ఆ ఇద్ధరికి వివాహ సంబంధాలు రావడం మొదలయ్యింది. దీనితో ఇల్లంతా శుభ్రం చేసి, సున్నాలు వేయించి, ఇంటిముందు రంగురంగుల ముగ్గులు వేయించాలని భారతమ్మ దంపతులు నిర్ణయించుకున్నారు. దానితో పాటుగా ఇంతకాలం పనిచేసిన వ్యక్తిని వేరే ఇల్లు చూసుకోమ్మని చెప్పాలని అనుకున్నారు. కొడుకులకు వివాహం అయ్యాకా వారికి కేటాయించడంతో పాటుగా విధి నిర్వహణలో బాగంగా ఇంటికి రాజ్యపాలకులు, రక్షకులు, మండలాధీశులు ఎక్కువగా వచ్చే అవకాశం వుంటుందనే ఉద్ధేశ్యంతో ఆ వ్యక్తిని ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి మారమని ఆ దంపతులు చెప్పారు. ఆ మాట చెప్పగానే ఆ వ్యక్తి ఆ దంపతులు మీదికి ఉవ్వెత్తున లేచాడు.తాను ఎక్కడికి వెళ్ళనని గొడవ చేశాడు. ఇంతకాలం ఈ ఇంట్లో నయానాణేం చెల్లించకున్న ఇంట్లో వుండనిచ్చాం. చేతినిండా పనిఇచ్చాం, నీకు నీ కొడుకులకు నీడనిచ్చాం. అడిగినన్ని నాణేలు ఇచ్చాము. నీ కుటుంబాన్ని మా కుటుంబంలో ఒక్కరిగా చూసుకున్నాం. ఇపుడు మా అవసరరీత్యా వెళ్ళిపొండి అంటే ఈ గొడవ ఏంటి? అని భారతమ్మ ఎంత చెప్పినా వినలేదు.
భారతమ్మ ఇద్ధరు కొడుకులు కూడా చెప్పి చూశారు. వారి మాట వినలేదు. ఆ వ్యక్తి కొడుకులు వచ్చి మేము ఈ ఇంట్లోనే పుట్టాం. ఈ ఇంట్లోనే పెరిగాం. ఈ ఇంట్లోనే వుంటాం. ఎవ్వరు మమ్మల్ని బయటికి పంపిస్తారో చూస్తాం అని ఖరాఖండిగా ఏగేసి చెప్పారు. దీనితో భారతమ్మ కుటుంబం మొదటిసారిగా గ్రామ చావడి పంచాయితీ పెట్టింది. వారి గొడవ పంచాయితీ సమయానికి గ్రామగ్రామాన తెలిసి ఆశ్చర్యపోయారు. ముక్కు మొఖం తెలియని ఇద్ధరిని చేరదీసి, పనిఇచ్చి, ఇంట్లో కుటుంబ సభ్యులలాగా చేరదీసి ఆదరించిన వారిపైనే దురుసుగా ప్రవర్తించిన ఆ వ్యక్తి పైనా కుటుంబసభ్యులపైన గ్రామాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే అసక్తి పెరిగింది.
నిర్ణయించిన రోజుకు పంచాయితీ దగ్గరికి రెండు కుటుంబాల సభ్యులు వచ్చారు. గ్రామపెద్ధల పంచాయితీ వినడానికి దూర ప్రాంతాల నుండి ప్రజలు వచ్చారు. పంచాయితీ మొదలయ్యింది. ధర్మయ్య విషయం అంతా చెప్పాడు. గ్రామపెద్ధలు కూడా అతడు చెప్పినదంతా విన్నారు. ఇంటినుండి వెళ్లిపోవడానికి నీకున్న అభ్యంతరం ఏమిటి? అని ఆ వ్యక్తిని ప్రశ్నించారు. తాను పొట్టచేత పట్టుకొని తన భార్యతో ఈ ఊరికి వచ్చిన మాట నిజమే. వారి ఇంట్లో నేను గత పాతిక సంవత్సరాలుగా వుంటున్నది మీకు తెలిసినదే. ఆ ఇంటితో మాకున్న సంబంధం విడదీయలేనిది. అందుకని మేము వెళ్లము అని చెప్పాడు. అలా ఏలా వీలవుతుంది. వారిది లంకంతా ఇల్లు పైగా అవసరం లేదని, పైగా కొడుకులు ఇద్ధరు చిన్న పిల్లలు కాబట్టి ఇల్లు పెద్ధగా అవసరం వుండదని మిమ్మల్ని ఇంతకాలం వుండనిచ్చారు. ఇపుడు వారి అవసరాలు పెరిగాయి కాబట్టి నీవు ఇల్లు వదిలి వేరే ఇల్లు చూసుకోవడం ఉత్తమం అని గ్రామపెద్ధలు చెప్పారు.
తాను ఇల్లు వదిలే ప్రసక్తే లేదని మీకు ఇంకా నిర్ణయం తీసుకోవాలనుకుంటే మన రాజ్య నియమాల ప్రకారం ఆ ఇంటిలో ఎంతమందిమి వుంటున్నామో అంతమంది సభ్యుల అభిప్రాయాలు తీసుకొని ఆ ఇంట్లో ఎవరు వుండాలో నిర్ణయించాలని చెప్పాడు. పైగా ఆ నియమం ఎప్పటినుండో వుందని తాను కొత్తగా చెబుతున్నదేమీ కాదని గట్టిగా వాదించాడు.
ఆ వ్యక్తి చెప్పిన రాజ్య నియమం విన్నతరువాత గ్రామాధికారులతో పాటుగా ధర్మయ్య, భారతమ్మ, వారి ఇద్ధరు కొడుకులు, పంచాయితీకి వచ్చిన పెద్ధలు, విస్మయం చెందారు. ఆ రాజ్య నియమం ప్రకారం ఏదైనా వివాదం తలెత్తినప్పుడు ఆ వివాదానికి సంబంధించిన వ్యక్తుల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని అందులో ఎవరికి ఎక్కువ మొత్తంలో ఫలితాలు వస్తాయో వారిదే విజయంగా నిర్ణయించడం జరుగుతుంది. ఇది ఆ రాజ్యనియమం.
ఆ మాట విన్న భారతమ్మ కుప్పకూలిపోయింది. ఆ ఇద్దరు కొడుకులకు విషయం ఆర్థం అయ్యింది. వారికే కాదు అక్కడ వున్న అందరికి విషయం ఆర్థం అయ్యింది. ఆ గ్రామ సచివాలయంలో ఆ ఇంట్లో మొత్తం పదకొండు మంది వుంటున్నట్లుగా నమోదు వున్నది. అందులో భారతమ్మ, ధర్మయ్య వారి ఇద్ధరు కొడుకులు కాగా ఆ వ్యక్తి కుటుంబానికి చెందిన ఎడుగురి పేర్లు నమోదయ్యి వున్నాయి. ఒకవేళ ఆ కుటుంబ సభ్యుల అభిప్రాయలు తెలుసుకునే కార్యక్రమం చేస్తే ఏ వ్యక్తికి ఎక్కువగా అభిప్రాయాలు వస్తాయి? ఏ వ్యక్తి ఇల్లు వదిలి పోవాల్సివుంటుంది? అనే చర్చ రాజ్యవ్యాప్తంగా జరిగింది.
(గమనిక: ఇది ఒక సాధారణ కథ మాత్రమే. ఈ కథకు భారతదేశ రాజకీయాలకు ఏలాంటి సంబంధం లేదు. కావున పాఠకులు గమనించగలరు.)
