(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
“అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం కోరుట్ల అగ్రికల్చర్ మార్కెట్ ప్రాంగణంలో వాహన డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెట్టుపల్లి డిఎస్పీ రాములు, కోరుట్ల సిఐ సురేష్ బాబు, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్, మెట్టుపల్లి ప్రాంతాలకు చెందిన లారీ, ఐచర్ వాహన డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, రోడ్డు పై చట్టపరమైన నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చన్నారు. ముఖ్యంగా లారీలు, ట్రక్కులు, కంటైనర్ వంటి భారీ వాహనాలను రోడ్డు అంచున నిలపడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. అలా నిలిపితే వెనుక నుంచి వచ్చే వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
వాహనాలపై రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని, వాహనాలను ఇతరులకు ఇబ్బంది కలగకుండా సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేయాలని సూచించారు. ఇలా చేయడం వల్ల తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చని అన్నారు.
అలాగే వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి విషయాలు ఆలోచిస్తూ డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. అలా చేస్తే డ్రైవర్ దృష్టి చెదిరి ప్రమాదాలకు దారి తీసే అవకాశముందని పేర్కొన్నారు.
డ్రైవింగ్ సమయంలో స్టీరింగ్ స్టక్ అవడం వంటి సమస్యలు ఎదురైతే వెంటనే మెకానిక్‌ను సంప్రదించి కారణాలు తెలుసుకుని సరైన మరమ్మత్తులు చేయించుకోవాలని తెలిపారు. వాహనాల సాంకేతిక లోపాలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే సరిచేసుకుంటే ప్రమాదాలను తగ్గించవచ్చని ఎస్పీ సూచించారు.
